CSS Drop Down Menu

Thursday, April 12, 2018

ఏపికి వచ్చిన రూ. 40 వేల కోట్లలో, రూ.38వేల కోట్ల నగదు అదృశ్యం ?


ఆర్బిఐ నోట్ల రద్దు అనంతరం కొత్త నోట్లు పంపిణీ చేయడం మొదలు పెట్టిన నాటి నుంచి గత నెల మార్చి వరకూ ఏపికి వచ్చిన మొత్తం రూ. 40 వేల కోట్లు. అయితే ఆ నగదులో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బ్యాంకులన్నింటిలో కలిపి సుమారు 2000 కోట్ల డబ్బు మాత్రమే ఉందని తెలుస్తోంది. మరైతే..మిగతా ఆ డబ్బు రూ.38,000 కోట్ల నగదు ఏమైంది?...సహజంగా ఈ విషయం తెలియగానే అందరికీ వచ్చే డౌటే ఇది!. ఇప్పుడు అచ్చంగా అదే డౌట్ ఆర్బిఐ అధికారులకు వచ్చిందట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఎటిఎంలో డబ్బు రాక బ్యాంకుకు వెళితే నగదు లభించక ప్రజలు నానా ఇక్కట్లు పడుతూ బ్యాంకులను,ప్రభుత్వాలను తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం తెలిసిన ఆర్బీఐ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఎపికే డబ్బును పంపామని, అయినా అక్కడే నగదు కొరత రావడం ఏమిటంటూ ఆశ్చర్యపోయారట. అందుకే అసలేం జరిగిందో తెలుసుకునేందుకు విచారణ కోసం ఎపికి రానున్నారట.


రాష్ట్రవ్యాప్తంగా తమ ఖాతాల్లోని నగదు డ్రా చేసుకునేందుకు ఎపి ప్రజల పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏ వూరులో చూసినా సుమారు 90 శాతం ఎటిఎం లు పనిచేయవు. ఆ పనిచేసే ఎటిఎంలకు లెక్కలేనంత మంది కస్టమర్ల తాకిడి. పోనీ బ్యాంకు నుంచి తీసుకుందామా అంటే...అచ్చం నోట్ల రద్దు నాటి పరిస్థితులను తలపిస్తూ నగదు రేషన్. ఇక ప్రత్యామ్నాయ మార్గాలన్నీ బంద్. ఇవీ సంక్షిప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న నగదు కష్టాలు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నగదు కష్టాలు తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నగదు అవసరాల కోసం రూ.13 వేల కోట్లు పంపాలని ఆర్బీఐని గట్టిగా కోరిందట. దీనిపై వారు లెక్కలు తీసి చూసి ఎపి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం అంతటితో ఆగిపోలేదని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. ఎపి నుంచి నగదు కోసం ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఎపికి పంపిన నగదు లెక్కలు చూసిన ఆర్బిఐ అధికారులు ఒక విషయం కేంద్రానికి నివేదించారట.

కానీ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో కేవలం 2300 కోట్ల రూపాయల నగదే ఉందని, ఆ డబ్బును అటు బ్యాంకుల్లో ఇచ్చేందుకే ఉంచాలో...లేక ఎటిఎంలో పెట్టాలో అర్థం కావడం లేదని ప్రభుత్వానికి తెలిపాయట. ఇదే విషయం ఆర్బిఐ దృష్టికి వెళ్లేసరికి నోట్ల రద్దు అనంతరం డబ్బు పంపడం ప్రారంభించిన నాటి నుంచి గత నెల మార్చి వరకు ఎపికి 40 వేల కోట్ల రూపాయల నగదు పంపించామని, ఎపి బ్యాంకులు చెబుతున్న ప్రకారం 2300 కోట్ల నగదే ఉంటే మరి మిగతా 37,700 కోట్ల నగదు ఏమైందని సహజంగానే సందేహపడ్డారట. అందుకే ఈ వ్యవహారం ఏంటో తేల్చాలని నిర్ణయించుకున్నారట.

అసలే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో ఎపిలో ఇలా డబ్బుల లెక్కలు తేడా వచ్చాయనేసరికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఈ ఈ విషయంపై క్షేత్ర స్ధాయి వరకూ వెళ్లి ఏం జరుగుతుందో క్షణ్ణంగా దర్యాప్తు చేయాలంటూ ఆర్బిఐని ఆదేశించిందట. దీంతో అతి త్వరలో ఆర్బిఐ అధికారులు రాష్ట్రానికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టనున్నట్లు ఢిల్లీ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎపిలో ఒక వైపు వైసిపి...మరోవైపు బిజెపి రాష్ట్రంలో నగదు అధికార పార్టీ నేతలు దోచేసి దాచేశారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆర్భిఐ అధికారులు రంగంలోకి దిగనుండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. అయితే ఆర్బిఐ నిజంగానే క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే ఎపిలో అదృశ్యమైన నగదు ఆచూకి కనిపెట్టడం అంత కష్టమేమీ కాదంటున్నారు...అయితే వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయోనని పలువురు అప్పుడే ఆందోళన చెందుతున్నారట.





0 comments:

Post a Comment